సమస్యలను గుర్తించి.. పరిష్కార మార్గాలను అన్వేషించిన విద్యార్థులు -- విజయవంతంగా జిల్లా స్థాయి బాలల సైన్స్ సదస్సు -- రాష్ట్రస్థాయి అర్హత సాధించిన మూడు ప్రాజెక్టులు
నారాయణపేట, నవంబర్ 6 (సూర్యన్యూస్) :
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మకతతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు జిల్లా స్థాయి పోటీలు శుక్రవారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో ఎంపికైన మూడు విద్యార్థి బృందాల ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 48 విద్యార్థి బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి శాస్త్రీయ పరిజ్ఞానంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని సూచించారు. పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించుకుని నూతన ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
*విజేతలు వీరే...*
ఈ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బోగారానికి చెందిన ప్రియాంక, స్వప్న బృందం మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా జెడ్పీహెచ్‌ఎస్ మద్దూరుకు చెందిన చందు, మనోవర్షిత్ బృందం రెండవ, జెడ్పీహెచ్‌ఎస్ మరికల్‌కు చెందిన అఖిల, అక్షయ బృందం మూడవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. న్యాయనిర్ణేతలుగా స్ఫూర్తి డిగ్రీ కళాశాల అధ్యాపకులు కావేరి, మానస వ్యవహరించారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, జిల్లా సెక్టోరియల్ అధికారి నాగార్జునరెడ్డి, మధ్యాహ్న భోజన పథకం అధికారి యాదయ్యశెట్టి, జాతీయ బాలల విజ్ఞాన సదస్సు సమన్వయకర్త మహేష్‌కుమార్, జిల్లా సైన్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు వార్ల మల్లేశం, సంజీవరెడ్డి, భౌతికశాస్త్ర సీనియర్ ఉపాధ్యాయులు జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.