దీపావళి వెలుగుల పండుగ కావాలి.. ప్రమాదాలకు నిలయంగా మారకూడదు
విజయవాడ, మేజర్ న్యూస్ : దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా జరుపుకునేలా టపాసుల దుకాణాల ఏర్పాట్లు, భద్రతా నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టపాసుల విక్రయాల కంటే ప్రజల ప్రాణ భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శనివారం రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో దీపావళి టపాసుల దుకాణాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో గరిష్టంగా 50 దుకాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, ప్రతి దుకాణం మధ్య కనీసం మూడు మీటర్ల ఖాళీ స్థలం ఉండేలా చూడాలన్నారు. దుకాణాలను 'U' ఆకారంలో ఏర్పాటు చేయాలని, నివాస ప్రాంతాలు, అధిక జనసంచారం ఉండే ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నినిరోధక నిర్మాణ సామగ్రితో షెడ్లు నిర్మించాలని, నాణ్యమైన విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేయాలని, దుకాణాల వద్ద దీపాలు, లాంతర్లు ఉపయోగించరాదని, టపాసుల డెమో లేదా టెస్ట్ నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి దుకాణం వద్ద నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో 30 సెకన్లలోపు స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. సమీపంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉండాలని, దుకాణాలకు కనీసం 50 మీటర్ల దూరంలో పటాకులు కాల్చే ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. టపాసుల విక్రయ ప్రాంగణాల్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి 10 నిమిషాలకు మైక్ ద్వారా భద్రతా సూచనలు ప్రసారం చేయాలని, టపాసులు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి తెలుగు, ఆంగ్ల భాషల్లో భద్రతా జాగ్రత్తల కరపత్రాలు అందించాలని ఆదేశించారు. అనుమతించిన పరిమితికి మించి టపాసుల నిల్వలు ఉంచరాదని, దుకాణాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఆర్డీవోలు, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దుకాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాపారులకు అనుమతుల జారీలో ఇబ్బందులు లేకుండా ఆర్డీవో కార్యాలయాల్లో సింగిల్ విండో విధానాన్ని అమలు చేసి, జీఎస్టీ, పోలీస్, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలు పర్యావరణహితమైన టపాసులను వినియోగించాలని కలెక్టర్ కోరారు. అధిక శబ్దాలు వచ్చే టపాసుల వల్ల వృద్ధులు, హృద్రోగులు, చిన్నపిల్లలు, పక్షులు, జంతువులకు ఇబ్బందులు కలుగుతాయని, శబ్ద కాలుష్యానికి బదులుగా కాంతులు విరజిమ్మే టపాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీపావళిని ప్రమాదరహితంగా జరుపుకునేందుకు ప్రజలు, వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, డీసీపీ అడ్మిన్ కేజీవి సరిత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏ.వి శంకరరావు, విఎంసి అడిషనల్ కమిషనర్ ఏ.రవీందర్ రావు, విఎంసి డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్ రత్నబాబు, ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.