రక్తదానం ప్రాణదానంతో సమానం.. 467 యూనిట్ల రక్తం సేకరణ: ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: రక్తదానం ప్రాణదానంతో సమానమని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో మొత్తం 467 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. శిబిరాన్ని పరిశీలించిన ఎస్పీ రక్తదానం చేసిన దాతలను అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ అమరులైన పోలీసు వీరుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారు ఆశించిన శాంతియుత, సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, శస్త్రచికిత్సల సమయంలో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని కోరారు.పోలీస్ ఫ్లాగ్ డే ద్వారా అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు ప్రజల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. రెడ్‌క్రాస్, తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు, వికారాబాద్, తాండూరు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సిబ్బంది సహకరించారు. జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీలు అంజయ్య, వీరేష్, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.