రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా?
సూర్య కోనరావుపేట ::ఓవైపు వడగళ్ల వానతో పంట నష్టం.. మరోవైపు సాగుపై అనిశ్చితి.. ఇంకోవైపు పరిహారం కోసం రైతుల ఎదురుచూపులు! ఇలా అన్నదాతలు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీజేపీ మండల అధ్యక్షుడు మిర్యాలకార్ బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. గతంలో వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలు సాగు చేయవద్దని సూచిస్తున్న నేపథ్యంలో రైతులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, అలాంటి రైతులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యలను విస్మరించకుండా కోనరావుపేటను కరువు మండలంగా ప్రకటించి, అన్నదాతలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి జలంధర్, మండల ఉపాధ్యక్షుడు చింతల పరశురాములు, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తీగల జయశ్రీ, సీనియర్ నాయకులు వామన్, చల్ల జితేందర్ రెడ్డి, కడర్ల వికాస్, వేల్పుల మైపాల్, మోతుకు బాను, గుండా శ్రీకాంత్, పిల్లి వెంకటేష్, బాలరాజ్, బూత్ అధ్యక్షులు చౌటపల్లి వెంకటి, ధూర్ల శంకర్, పొన్నం మహేష్, రాపోలు శ్రీనివాస్, మల్లేశం, కట్లే ప్రదీప్, సుధాగోని సాయికృష్ణ, తిరుపతి, అంకమల్ల శంకర్, గిరి గట్టయ్య, రాములు, విఠల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.