నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, మేజర్ న్యూస్: అర్నబ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వరి పంటలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుడివాడ రూరల్ మండలం రామనపూడి, గుడ్లవల్లేరు మండలం కుచికాయలపూడి, పోలిమెట్ల, అంగలూరు, చంద్రాల, వడ్లమన్నాడు గ్రామాల్లో కూటమి నాయకులు, రైతులతో కలిసి నేలకొరిగిన వరి పనలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హెక్టారుకు రూ.20 వేల నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు. రైతులు తమ పంట నష్టాన్ని తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే గ్రామాల్లో వీఆర్వోలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నష్టం అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. డ్రైన్లలో నీరు ఎగదన్నడం, విద్యుత్ సమస్యలను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పంట నష్టం నమోదు పారదర్శకంగా చేయించుకోవాలని, లేనిపక్షంలో పంట విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులకు సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. తుఫాను కారణంగా రైతులు నష్టపోవడం బాధాకరమని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పొలాలను సందర్శించి తమ సమస్యలను తెలుసుకోవడంతో ధైర్యం కలిగిందని రైతులు తెలిపారు. ఈ పర్యటనలో గుడివాడ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, నాయకులు సూరమనేని చిన్నబాబు, కైలే కాళిదాసు, మసిముక్కు గోపాలకృష్ణ, గోరుపత్తి సుబ్బారావు, రాంబాబు, కైలే రంజిత్, గుడ్లవల్లేరు మండల జనసేన ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, నాయకులు వల్లభనేని వెంకట్రావు, అట్లూరి స్వరూప్, మేక వెంకటేశ్వరరావు, దుగ్గిరాల శేషుబాబు, పెద్దబోయిన రాజు, బుర్ర ధనకోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, చిలుముల ఫణి, బండి శ్రీకాంత్, జనసేన నాయకులు గంగాధర్ రావు, లంకపల్లి పురుషోత్తం బాబు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.