ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించి దోమల సమాజాన్ని నిర్మిద్దాం
పులివెందుల మేజర్ న్యూస్ :
దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రతి వారం శుక్రవారం నాడు తప్పనిసరిగా 'డ్రై డే' పాటించాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దోమ గుడ్డు దశ నుంచి పూర్తి స్థాయి దోమగా మారడానికి దాదాపు 7 నుండి 10 రోజుల సమయం పడుతుందన్నారు. అందుకే వారానికి ఒకరోజు (శుక్రవారం) ఇంటి లోపల, బయట నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేసి ఆరబెట్టడం ద్వారా దోమల జీవిత చక్రాన్ని లార్వా దశలోనే అడ్డుకోవచ్చని తెలిపారు.
*ఫ్రైడే - డ్రైడే పాటించడం వల్ల కలిగే ఉపయోగాలు:*
*దోమల ఉత్పత్తికి చెక్:* నిల్వ ఉన్న నీటిలోనే దోమలు గుడ్లు పెడతాయి. నీటి పాత్రలను ఖాళీ చేసి, బాగా రుద్ది కడిగి ఆరబెట్టడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు నశిస్తాయి.
*భయంకర వ్యాధుల నుండి రక్షణ:* డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చు.
*హాస్పిటల్ ఖర్చులు ఆదా:* సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటం వల్ల అనవసర వైద్య ఖర్చులు తగ్గి కుటుంబ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
*పరిసరాల పరిశుభ్రత:* వారానికోసారి ఇల్లు, పరిసరాలను శుభ్రం చేసుకోవడం వల్ల పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది.
*సామూహిక ఆరోగ్యం:* గ్రామంలో లేదా కాలనీలో ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో డ్రైడే పాటించడం వల్ల దోమల సంఖ్య గణనీయంగా తగ్గి అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది.
*డ్రై డే రోజున చేయాల్సిన పనులు:*
*కూలర్లు, డ్రమ్ములు:* కూలర్లు, నీటి తొట్లు, డ్రమ్ములలోని పాత నీటిని పూర్తిగా పారబోసి, బాగా రుద్ది కడిగి పొడిగా ఆరబెట్టాలి.
*పాత్రలు & కుండీలు:* పూల కుండీల కింద ఉండే ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
*వాటర్ ట్యాంకులు:* ఇంటి పైన ఉండే ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి డ్రమ్ములపై మూతలు గట్టిగా ఉంచాలి.
*మురుగు నీటి నివారణ:* ప్రవహించని మురికి నీటిపై లేదా నిల్వ ఉన్న నీటి గుంతలపై వాడిన ఇంజన్ ఆయిల్ లేదా కిరోసిన్ చల్లాలి. ఇది నీటిపై పొరలా ఏర్పడి లార్వాలకు ఆక్సిజన్ అందకుండా చేసి వాటిని చంపేస్తుంది.
ప్రతి ఒక్కరూ "ప్రతి శుక్రవారం - డ్రై డే" ను ఒక బాధ్యతగా గుర్తుంచుకొని పాటించి, దోమల రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని సిద్దయ్య కోరారు.
పి కృష్ణ. పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా