విడవలూరు టీడీపీ కంచుకోట అని మరోసారి నిరూపించండి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
విడవలూరు, మేజర్ న్యూస్ : విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపిస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ మంచి జరగాలంటే మరోసారి కూటమికి మద్దతు తెలపాలని కోరారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విడవలూరు మండలంలోని రామతీర్థం, రామచంద్రాపురం, పెద్దపాళెం, గాదెలదిన్నె, వావిళ్ల, దంపూరు, చౌకచర్ల గ్రామాల్లో ఎమ్మెల్యే గారు పర్యటించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
విడవలూరు జడ్పీటీసీ అభ్యర్థి చౌటూరు వెంకట శేషమ్మతో పాటు రామతీర్థం ఎంపీటీసీ అభ్యర్థి శ్రీహరికోట గోపీ, రామచంద్రాపురం అభ్యర్థి కోడూరు విజయమ్మ, పెద్దపాళెం అభ్యర్థి రామలక్ష్మి, గాదెలదిన్నె–వరిణి–దండిగుంట అభ్యర్థి కరిష్మా, వావిళ్ల అభ్యర్థి వెంకట ప్రసాద్, దంపూరు అభ్యర్థి నగిరిపాటి లావణ్య, చౌకచర్ల అభ్యర్థి కొల్లు పుష్పలతకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలను నేరుగా కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, విడవలూరు మండలంలో పార్టీ బలాన్ని మరోసారి చాటాలని పిలుపునిచ్చారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోయినా, గత రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని తెలిపారు. పలు గ్రామాల్లో రహదారులు, సీసీ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయా పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో కొనసాగుతున్న జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయితే తాగునీటి సమస్య పరిష్కారానికి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయం
డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రైతులకు సకాలంలో ఎరువులు, సాగునీరు, విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవడంతో గత సీజన్లో పంటలు సమృద్ధిగా పండాయని, రైతులు మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేలా లింక్ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
గుంతలు వెంటనే పూడ్చండి.. నిధులు రాగానే రోడ్డు నిర్మాణం
దంపూరు, చౌకచర్ల గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గుంతలమయమైన రోడ్లపై స్పందించారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వెంటనే గుంతలు పూడ్చాలని స్థానిక నాయకులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఇతర రహదారుల అభివృద్ధితో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు, శ్మశానవాటిక అభివృద్ధి, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమస్య పరిష్కారం కాకుంటే నేరుగా నా దగ్గరకు రండి
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ముందుగా స్థానిక నాయకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని, అక్కడ పరిష్కారం కాకపోతే నేరుగా తనను కలిసి విన్నవించాలని ప్రజలకు సూచించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు పూర్తయిన వెంటనే ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ప్రారంభించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
నాయకుడు ఒక్కరే.. గ్రూపు రాజకీయాలకు తావులేదు
నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు ఎలాంటి తావులేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు స్పష్టం చేశారు. ‘మనందరికీ నాయకుడు ఒక్కరే.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు’ అని పేర్కొంటూ, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీ జెండా కింద ఐక్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.