ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థులు- వెనుకబడిన వైసీపీ శ్రేణులు!
పెద్దపంజాణి మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మండల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపంజాణి జడ్పిటిసి అభ్యర్థి జయరామిరెడ్డి గురువారం తుర్లపల్లి, అమ్మరాజుపల్లి పంచాయతీలలో ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మండలంలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారంలో వేగంగా దూసుకుపోతున్నారు. మండల స్థాయి నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో టీడీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పసుపు జెండాల రెపరెపలు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తుతోంది. ప్రచారంలో మండల ప్రజలు పోటీలో ఉన్న అభ్యర్థులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు మహిళలు కూడా హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారు. యువత పెద్ద ఎత్తున ప్రచారంలోభాగస్వామ్యమవుతుండటంతో పార్టీ క్యాడర్‌లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రజా సమస్యలను అభ్యర్థులు ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లు సైతం బహిరంగంగానే టీడీపీ వైపు మొగ్గు చూపుతుండటం గమనార్హం.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి ఎంపీటీసీ శ్రేణులు ప్రచారంలో పూర్తిగా వెనుకబడినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత, స్థానిక సమస్యలను ఎత్తిచూపడంలో వైసీపీ అభ్యర్థులు పూర్తిగా విఫలమవుతున్నారు. గ్రామాల్లో అసంతృప్తి కారణంగా వైసీపీ అభ్యర్థులు రక్షణాత్మక ధోరణిలో పడ్డారు. మండల పార్టీ శ్రేణులలో అంతర్గత విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల వైసీపీ ప్రచారం మందకొడిగా సాగుతోంది.ప్రస్తుతం మండలంలో కనిపిస్తున్న రాజకీయ సమీకరణాలు టీడీపీకి పూర్తిగా అనుకూలంగా మారాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార నిర్వహణ వరకు టీడీపీ పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తుండటంతో ప్రత్యర్థి పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేక తడబడుతున్నాయి. పెద్దపంజాణి మండలంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే మెజారిటీ ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా టీడీపీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.