మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు...
సూర్య - మంథని: 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు మరో ఎనిమిది నెలల గడువు మాత్రమే ఉన్నందున అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. గురువారం దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.మంథని పుష్కర ఘాట్ పునర్నిర్మాణం, విస్తరణకు ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, కాశీ తరహాలో ప్రతిరోజూ సాయంత్రం గోదావరి నదికి సప్త హారతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఓదెల, రామగుండం ప్రాంతాల్లోనూ చిన్న పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం...
మంథనిలోని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని రూ.10 కోట్లతో ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం పునర్నిర్మిస్తున్నట్లు శైలజ రామయ్యార్ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీకి మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
పుష్కర ఘాట్ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభించి మార్చి చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పనుల్లో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీరాములు, ఆర్డీవో సురేష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.