రైతన్నా.. నీ హక్కుల కోసం కదలిరా! --నవంబర్ 15న నల్లగొండలో రైతు గర్జన.. --లక్షలాది మందితో బహిరంగ సభకు సన్నద్ధం కావాలి
--రైతన్నా.. నీ హక్కుల కోసం కదలిరా!
--నవంబర్ 15న నల్లగొండలో రైతు గర్జన..
--లక్షలాది మందితో బహిరంగ సభకు సన్నద్ధం కావాలి
వైరా రూరల్ (సూర్య న్యూస్):-
దేశానికి అన్నం పెట్టే రైతన్నను కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోందని, వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సిన పాలకులే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం విమర్శించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి రైతు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు.
అఖిలభారత కిసాన్ సభ జాతీయ మహాసభలు నవంబర్ 15 నుంచి 18 వరకు పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని కోరారు.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయానికి అవసరమైన వనరులు, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం వంటి అంశాలపై జాతీయ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.
రైతుల కష్టాలు, కన్నీళ్లు పాలకులకు కనిపించేలా ఐక్యంగా గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైందని, రైతాంగ హక్కుల సాధన కోసం జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సుంకర సుధాకర్, తాళ్లపల్లి కృష్ణ, కొండబోయిన నాగేశ్వరరావు, దుగ్గి కృష్ణ, దొంతబోయిన నాగేశ్వరరావు, చింతనపు చలపతిరావు, తూము సుధాకర్, సరుకుమల్లి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.