ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి అర్జీదారులకు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి.జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట,: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతల మేరకు సత్వరమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజావాణికి వస్తున్నారని, వారి ఫిర్యాదులపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 103 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణికి ముందు జిల్లా అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తులపై తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేయాలని, తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణితోపాటు నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులను కూడా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
వేసవిలో తాగునీటి సరఫరాకు ముందస్తు చర్యలు
వచ్చే వేసవిలో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించేందుకు నవంబర్ మొదటి, రెండో వారాల్లో ప్రత్యేక కార్యాచరణతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడం, పైపులైన్లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడటం, అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు వృథా కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, వేసవిలో నీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కె. హైమావతి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, ఎస్‌డీసీలు సుదర్శన్ రెడ్డి, విజయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.