ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా.. సొంత ఖర్చుతో ప్రజల దాహార్తి తీర్చుతున్న సర్పంచ్
దోమ, మేజర్ న్యూస్: గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో దోర్నాలపల్లి సర్పంచ్ పట్లోళ్ల సత్యనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తన సొంత నిధులు రూ.2.5 లక్షలు వెచ్చించి గ్రామంలో నూతనంగా మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.ఈ ప్లాంట్ ద్వారా గ్రామస్తులకు 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీటి క్యాన్‌ను కేవలం రూ.5కే అందించనున్నారు. బయట నుంచి తాగునీటిని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే తక్కువ ధరకు స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నిత్యం తాగునీటి కోసం ఖర్చు చేసే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఏర్పాటు ఆర్థికంగా ఊరటనివ్వనుంది.గ్రామ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సర్పంచ్ తన సొంత డబ్బుతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రజాప్రతినిధులు తలచుకుంటే సొంత చొరవతోనూ గ్రామాభివృద్ధికి బాటలు వేయవచ్చని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. తక్కువ ధరకు శుద్ధి చేసిన తాగునీరు అందించాలనే సర్పంచ్ నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పరి మహిపాల్, గ్రామ పెద్దలు నరసింహారెడ్డి, వెంకట్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, నాగేందర్ రెడ్డి, ఓంకార్, బచ్చలి వెంకటయ్య, హరిజన్ వెంకయ్య, దామోదర్ రెడ్డి, చిట్యాల రాములు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.