25 వ వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తనపై నమ్మకం ఉంచి, ఘన విజయాన్ని అందించిన వార్డు ప్రజలకు కౌన్సిలర్ పూజారి మహేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు లభించిన విజయాన్ని వ్యక్తిగత విజయంగా కాకుండా 25వ వార్డు ప్రజల విజయంగా భావిస్తూ ఈ విజయాన్ని వార్డు ప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం, అందించిన ఆదరణ తనపై మరింత బాధ్యతను పెంచాయని అన్నారు. వార్డు అభివృద్ధికి గౌరవనీయులైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహకారంతో అవసరమైన నిధులు తీసుకొచ్చి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వార్డులో నెలకొన్న రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారు తన దృష్టికి తీసుకొచ్చే ప్రతి సమస్యను బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు. స్థానికంగా పరిష్కారం కాని సమస్యలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వార్డులోని ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తూ, అందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డులోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ 25వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానని కౌన్సిలర్ పూజారి మహేష్ స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.