ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు
నాణ్యత లేని భోజనం..! వాసన వస్తున్న తాగునీరు.. నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత.. హాస్టల్‌ను తనిఖీ చేసిన DMHO డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి
(రంగారెడ్డి -మేజర్ న్యూస్) పీఎంఆర్ హాస్పిటల్ నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం చేసిన సుమారు 80 మంది నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం ఆందోళనకు గురిచేసింది. వీరిలో 16 మంది విద్యార్థినులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆదివారం రాత్రి పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై ఆరా తీశారు.
అనంతరం నర్సింగ్ హాస్టల్‌ను సందర్శించి వంటగదిని, ఆహార పదార్థాలను పరిశీలించారు. హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని, తాగునీటి నుంచి దుర్వాసన వస్తోందని విద్యార్థినులు ఆయనకు ఫిర్యాదు చేశారు. భోజనం బాగాలేక తినకుండా పారబోస్తున్న పరిస్థితి ఉందని వివరించారు. వంటకు వినియోగిస్తున్న కూరగాయలను పరిశీలించిన DMHO.. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని స్పష్టం చేస్తూ హాస్టల్ నిర్వాహకులను హెచ్చరించారు.
తనిఖీల్లో గుర్తించిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు DMHO తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఆయన వెంట జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారి మహమ్మద్ షఫియోద్దీన్ ఉన్నారు.