బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం!
గుంటూరు జిల్లా ఐనవోలులోని విఐటి (VIT) యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ధ్యానేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్టల్ భవనం మొదటి అంతస్తులోని తన గదిలో ధ్యానేష్ మృతదేహాన్ని గుర్తించారు.
కాలేజీ యాజమాన్యం కథనం ప్రకారం.. ధ్యానేష్ రాత్రి భోజనం ముగించుకుని గదిలోకి వెళ్లాడు. అయితే మరుసటి రోజు ఉదయం టిఫిన్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చి గది తలుపులు తెరిచి చూడగా, అతను ఉరి వేసుకుని కనిపించాడని తెలిపారు.
ఈ ఘటనపై మృతుని తోటి విద్యార్థులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాచారం అందించి తాము అక్కడికి చేరుకునే లోపే మృతదేహాన్ని అమరావతి జనరల్ ఆసుపత్రికి తరలించారని ధ్యానేష్ మేనమామ ఆరోపించారు. అంతేకాకుండా, నిజానిజాలు తెలుసుకుందామని యూనివర్సిటీకి వెళ్లిన తమను లోపలికి అనుమతించకుండా యాజమాన్యం అడ్డుకుందని ఆయన వాపోయారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.