ఇంద్రకీలాద్రిపై వైభవంగా దీపావళి వేడుకలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ప్రదోష కాలంలో ఆలయ ప్రాంగణంతో పాటు ఉపాలయాల్లో దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు.
దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కుటుంబ సమేతంగా దీపాలు వెలిగించి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ ధనలక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల సంప్రదాయం ప్రకారం బాణాసంచా కాల్చి అమ్మవారికి జయజయధ్వానాలు పలికారు.
పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ వైదిక ఆచార సంప్రదాయాల ప్రకారం రాత్రి ఆలయ కవాట బంధనం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యురాలు గూడపాటి సరోజినీ దేవి, స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.