పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ భరోసా
మంచాల: మేజర్ న్యూస్: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని టీపీసీసీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మండలంలోని ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శనివారం ఆయన నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఆంబోత్ తండాకు చెందిన రాట్ల తర్యాకు రూ.60 వేలు, నేనావత్ బిచ్యకు రూ.26 వేలు, బండలేమూర్ గ్రామానికి చెందిన పాత్‌లోత్ నిలకు రూ.53,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.1,39,500 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వైద్య చికిత్సల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వారు తనను సంప్రదిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్‌తో పాటు అవసరమైన వారికి ఎల్ఓసీలు మంజూరయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తన బాధ్యతని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి శ్రీనివాస్, ఉప సర్పంచ్ సుమన్, నాయకులు సామల రాజేందర్ రెడ్డి, హరి నాయక్, గోపి, లచ్చు, కుమార్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి