బొక్కలగుట్టలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ
• బాలల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి
సూర్య, మందమర్రి :
చిన్నారులకు బాల్యం నుంచే హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా బాలల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని జిల్లా పంచాయతీ అధికారి కిషన్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాసు శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక బాల గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డీపీఓ కిషన్ బాలబాలికలతో వివిధ అంశాలపై చర్చించారు. బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధక చట్టాలు, బాల నేరాలకు సంబంధించిన చట్టాలపై వివరించారు. చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ప్రతీ బాలబాలికలకు విద్య, రక్షణ, సమాన అవకాశాలు అందాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం బాల్య వివాహాలను అరికట్టడంతోపాటు బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని సభలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ మహేష్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.