మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నవంబర్ 14 శనివారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ విజయ కుమార్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇన్సులిన్‌ను కనుగొనడంలో విశేష కృషి చేసిన ఫ్రెడరిక్ బాంటింగ్ సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మన శరీరంలోని క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ విజయ కుమార్ వివరించారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మధుమేహ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మధుమేహ రోగులకు ఉపయోగపడే ప్రత్యేక డైట్ షీట్‌ను ఆవిష్కరించి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ డైట్ షీట్ రూపకల్పనలో మెడికవర్ ఆసుపత్రి సీఈఓలు, డైట్ మేనేజర్ డేవిడ్, జార్జ్, వెంకట కిషోర్, సాగర్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర రెడ్డి, డాక్టర్ పెంచల ప్రసాద్ తదితర వైద్యులు, ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు. మధుమేహంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.