telangana
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డీటీసీ ప్రాంగణంలో 60 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం నేటితో ముగిసింది. సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొని నిష్ణాతులైన అధ్యాపకులచే శిక్షణ పొందారు. శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబర్ 20వ తేదీన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావించి సమయాన్ని వృధా చేయకుండా చదవాలని సూచించారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు సూచించిన విషయాలను పాటిస్తూ పూర్తిస్థాయిలో పరీక్షలకు సిద్ధం కావాలని తెలిపారు. కష్టపడి చదివిన వారికి విజయం తప్పకుండా వరిస్తుందని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర అంశాల్లో ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, నల్గొండ ప్రాంతాలకు చెందిన నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ అందించడంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని, గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను రెండు మూడు సార్లు నెమరువేసుకుంటూ సబ్జెక్టుల వారీగా ప్రాధాన్యత కేటాయించి చదవాలని సూచించారు. అదేవిధంగా ప్రిలిమినరీ పరీక్షలు, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తదుపరి దశ శిక్షణను ఉచిత భోజనం, వసతి సదుపాయాలతో అందించనున్నట్లు జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులు మాట్లాడుతూ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు జిల్లా పోలీస్ శాఖ అందించిన ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని, జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శిక్షణ అందించిన అధ్యాపకులను జిల్లా ఎస్పీ శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి. వెంకటి, శిక్షణ కేంద్రం సిబ్బంది, అధ్యాపకులు ప్రసాద్, వివేక్, ఫణీంద్ర, రమణ గౌడ్, అల్లం సాయి కృష్ణ, శంకర్, రమేష్, సమీర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.