విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది
సీతం కాలేజీలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, సీతం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలను మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సత్యా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు నిలయాలని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పుస్తక పఠనం దోహదపడుతుందని వివరించారు. సభాధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ మాట్లాడుతూ పుస్తకాలు విజ్ఞాన జ్యోతులని, ఉత్తమ గ్రంథాలు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడంతోపాటు సామాజిక స్పృహను, పౌర బాధ్యతను అలవరుస్తాయని,విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాదిఅని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తక పఠనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల గ్రంథాలయాన్ని నిత్యం సద్వినియోగం చేసుకుని విజ్ఞాన పరిధిని విస్తరించుకోవాలని సూచించారు. సీతం కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్.సత్యవతి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు సాయికృష్ణ, కీర్తన, బొనెల జ్యోతి, పి. ప్రహర్షిత్, విక్రమాదిత్య వర్మలను అభినందించారు. ఉత్తమ గ్రంథాలయ వినియోగదారు విభాగంలో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థిని జ్యోతి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ విజ్ఞాన సమాజ నిర్మాణానికి కృషి చేయాలనే సందేశంతో ఈ వేడుకలు స్ఫూర్తిదాయకంగా సాగాయి.ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం సుభద్ర దేవి తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ శ్రీనివాసరావు
భోగాపురం