telangana
సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగిస్తే సహించేది లేదు - ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య
సూర్య, మందమర్రి : సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను కార్మిక సంఘాల ఐక్య పోరాటంతో అడ్డుకుంటామని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. సంస్థ మనుగడ, కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా జరుగుతున్న నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రావణపల్లి, ఎల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసీ-3 గనుల టెండర్ల ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వేలంలో ప్రైవేటు కంపెనీలు పాల్గొంటున్న నేపథ్యంలో సింగరేణి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలో సింగరేణి వేలంలో పాల్గొనకపోవడం వల్ల గనులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లాయని, ఇప్పుడు సంస్థ వేలంలో పాల్గొంటున్నా గనులను ఇతరులకు అప్పగించే ప్రయత్నాలు జరగడం విచారకరమన్నారు. మందమర్రి ప్రాంతానికి కేకే-5 గని ఎంతో కీలకమని, అది కూడా మూతపడితే ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక పరిస్థితులు దెబ్బతింటాయని పేర్కొన్నారు. శ్రావణపల్లి గనిని సింగరేణికే కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో అరవిందో, అవంతిక సంస్థల టెండర్లను చట్టపరమైన పోరాటంతో అడ్డుకున్నామని, మరోసారి అదే తరహాలో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మెడికల్ బోర్డు నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యం వీడాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు 27 ఒప్పందం ప్రకారం నెలనెలా బోర్డు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ రెండు నెలలుగా సమావేశాలు జరగడం లేదన్నారు. 1981 కొమరయ్య ఒప్పందం ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించాలని కోరారు. మరోవైపు మెడికల్ అన్ఫిట్, మృతి చెందిన కార్మికుల వారసులకు సంబంధించి 210 మందికి పైగా ఇంటర్వ్యూలు పూర్తయినా నియామక ఉత్తర్వులు జారీ చేయకపోవడం దారుణమన్నారు. ఏడు నుంచి ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని, డిసెంబర్ 23 సింగరేణి డే నాటికి పెండింగ్లో ఉన్న ఉద్యోగాల ఉత్తర్వులు అందించాలని డిమాండ్ చేశారు. సింగరేణి డే సందర్భంగా ముఖ్యమంత్రి ఆటోలు పంపిణీ చేస్తామని ప్రకటించడం కంటే కార్మికుల చిరకాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు, కార్మికుల హక్కులపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. సింగరేణికి జెన్కో, ట్రాన్స్కో నుంచి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్ల సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆరోపించారు. అవసరమైన యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయడానికి నిధుల కొరత ఏర్పడటంతో ప్రైవేటు సంస్థలకు పనులు అప్పగించే పరిస్థితి నెలకొందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 18, 19 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రెండు రోజుల పాటు నిరసన దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే సమ్మెకు పిలుపునిచ్చేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ఎండీ అక్బర్ అలీ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, నాయకులు ఇప్పకాయల లింగయ్య, పెద్దపెల్లి బాలయ్య, గోపతి సత్యనారాయణ, ఎగ్గేటి రాజేశ్వరరావు, సీవీ రమణ, పారిపెల్లి సంజీవ్ కుమార్, హేమచందు, జువాజీ శ్రీనివాస్, శెట్టి రాజేందర్, జెట్టి మల్లయ్య, భుక్య రాజేందర్, డొక్కు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.