రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సూర్య వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారువేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై శనివారం భీమేశ్వర స్వామి ఆలయ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఆర్ అండ్ బీ సీఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్కిటెక్ట్, ధార్మిక సలహాదారుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులపై ఆరా తీశారు.అనంతరం ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పనులకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లా నాయక్, స్థపతులు జయేంద్రన్, గణేష్, స్ట్రక్చర్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.