telangana
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతిష్ఠాత్మక ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. కుటుంబానికి జీవనాధారమైన ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ పథకం కింద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడికి బీమా రక్షణ కల్పిస్తామని, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ బీమా భద్రతపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ఒక్క కుటుంబం నమోదు కాకుండా మిగిలిపోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.కావున అర్హులైన కుటుంబాలు ఈ నెల 19న నిర్వహించే ప్రత్యేక నమోదు శిబిరాలకు అవసరమైన వివరాలతో హాజరై, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.