పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్
జిన్నారం:పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ సూచించారు. మంగళవారం గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన ఆధ్వర్యంలో భద్రతా జాగ్రత్తలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జున గౌడ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, రసాయనాల నిర్వహణ వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రతా పరికరాలు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని పేర్కొన్నారు. కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా పరిశ్రమల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భద్రతా నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించరాదని సీఐ స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పరిశ్రమల యాజమాన్యాలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ హనుమంతు, పారిశ్రామిక ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.