పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర
పద్మనాభం, సూర్య: పద్మనాభం మండల పరిషత్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఒక చరిత్ర సృష్టించింది. పద్మనాభం పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కూటమి శ్రేణులు చేపట్టిన భారీ బైక్ ర్యాలీ మండల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంచలనం సృష్టించింది. కృష్ణాపురం నుండి పద్మనాభం వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర సాగిన ఈ సుదీర్ఘ ర్యాలీకి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేశారు.ఉదయం 9 గంటలకే కృష్ణాపురం సెంటర్ లో వందలాది బైకులపై కూటమి కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీ పసుపు జెండాలు, జనసేన గాజు గ్లాసు జెండాలు, బీజేపీ కాషాయ జెండాలతో రహదారులన్నీ నిండిపోయాయి. డప్పు వాయిద్యాలు, బాణాసంచా మోతలతో యువత "జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై గంటా" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.ప్రతి గ్రామంలోనూ మహిళలు బొట్టు పెట్టి హారతులు పట్టి, పూలవర్షం కురిపిస్తూ ఎంపీపీ అభ్యర్థి కుచ్చర్లపాటి అరుణకుమారికి, జెడ్పీటీసీ అభ్యర్థి కోరాడ రమణకు నీరాజనం పలికారు. "సైకిల్ గుర్తుకే మా ఓటు - అభివృద్ధికే మా ఓటు" అంటూ మహిళలు స్వచ్ఛందంగా నినాదాలు చేసారు.ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి కుచ్చర్లపాటి అరుణకుమారి ఉద్వేగంగా మాట్లాడుతూ "రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మన భీమిలి టైగర్ గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో పద్మనాభం మండలానికి గతంలో ఎన్నడూ లేనంతగా కోట్లాది రూపాయల నిధులు వచ్చాయి. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డు, పద్మనాభం నుండి చిన్నాపురం వరకు కొత్త రోడ్డు నిర్మాణం,ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, మంచినీటి పథకాలు, ఎల్ఈడీ లైట్లు, డ్రైనేజీలు అన్నీ పూర్తి చేశాం. మండల పరిషత్ కూడా మన చేతిలో ఉంటే పద్మనాభాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ మోడల్ మండలంగా చేస్తాం. 15 ఎంపీటీసీలు,జెడ్పీటీసీ అన్నీ కూటమివే" అని ధీమా వ్యక్తం చేశారు.జెడ్పీటీసీ అభ్యర్థి కోరాడ రమణ మాట్లాడుతూ " భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో యువతకు ఉపాధి, రైతులకు అండగా ఉంటాం" అని అన్నారు. ఈ భారీ ర్యాలీలో మండల క్లస్టర్ ఇంచార్జ్ లు, 15 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, మాజీ సర్పంచ్ లు, టీడీపీ, జనసేన, బీజేపీ మండల, గ్రామ స్థాయి నాయకులు, వందలాది మహిళలు, వందలాది మంది యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చివరి రోజున వచ్చిన ఈ అనూహ్య స్పందన చూస్తే పద్మనాభం పరిషత్ పీఠం కూటమిదేనని, ప్రత్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేరని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.