ఎస్.రాయవరంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు!
20 మంది విద్యార్థులకు దృష్టిలోపం గుర్తింపు
ఎస్.రాయవరం, నవంబర్ 3, మేజర్ న్యూస్:
జాతీయ అంధత్వ, దృష్టిలోపం నివారణ కార్యక్రమంలో భాగంగా ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. మండలంలోని సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు డాక్టర్ వాసంతి ఆధ్వర్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కె. లక్ష్మి 73 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. వారిలో 20 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలు అందించేందుకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వీసం ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.