తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలి
గీసుగొండ , మేజర్ న్యూస్, యాసంగిలో మొక్కజొన్న సాగును తగ్గించి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల రైతులకు సూచించారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా కొనాయమాకుల రైతు వేదికలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.యాసంగిలో వరి సాగు చేయవద్దని,మొక్కజొన్నకు బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు.తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వినియోగిస్తూ సాగు ఖర్చులు తగ్గించుకోవాలని విజయనిర్మల తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో స్థిరమైన నికర ఆదాయం పొందాలని సూచించారు. పురుగుమందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శన ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.హరిప్రసాద్‌బాబు,సాంకేతిక వ్యవసాయ అధికారి కృష్ణారెడ్డి, ఏఈఓలు బి.భరత్, పి.స్మిత, జి.రాజేష్, ఉద్యానవన అధికారి వేణుకుమార్, అగ్రిమోర్ సొల్యూషన్స్ ప్రతినిధి ఎస్.రవీందర్, ప్రజ్వల్ ఎఫ్‌పీసీఎల్ మేనేజర్ అయేషా,రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్; విష్ణు చందర్ ,గీసుకొండ, వరంగల్ జిల్లా