ఊట్కూరులో పశు ఆరోగ్య శిబిరం – గర్భకోశ వ్యాధుల చికిత్స, దూడలకు నట్టల నివారణ కార్యక్రమం
నిడమనూరు మేజర్ న్యూస్: నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలోని పశు ఆరోగ్య ఉప కేంద్రంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం, గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం మరియు దూడలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జి.వి. రమేష్ మాట్లాడుతూ... పశువులు సకాలంలో ఎదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం ద్వారా సకాలంలో చూలు కట్టించినట్లయితే వాటి జీవితకాలంలో ఎక్కువ సంఖ్యలో దూడలను పొందడంతో పాటు అధిక పాల ఉత్పత్తిని సాధించవచ్చని తెలిపారు.
పశువులకు నాణ్యమైన పచ్చిమేత, సమతుల్య దాణా, ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో అందించడం ద్వారా పునరుత్పత్తి ప్రక్రియ సక్రమంగా జరిగి పశువుల ఉత్పాదకత పెరుగుతుందని వివరించారు.
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని VBG RAM G పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి రైతు తమ పొలాల్లో పశుగ్రాస పంటలను సాగు చేసుకోవడం ద్వారా వేసవిలోనూ పశువులకు పచ్చిమేత అందించడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని తెలిపారు. పశుగ్రాస సాగుకు సంబంధించిన వివరాల కోసం సమీప పశువైద్యశాలను లేదా గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని సూచించారు.
అదేవిధంగా గ్రామాల్లో పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు VBG RAM G పథకం కింద ప్రతి గ్రామంలో మూడు నుంచి నాలుగు నీటి తొట్లను నిర్మించుకునే అవకాశం ఉందని తెలిపారు. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచులు వీలైనన్ని ఎక్కువ నీటి తొట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
రైతుల అవసరాల మేరకు పశువుల కొట్టాలు, గొర్రెల కొట్టాలు తదితర నిర్మాణాలకు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉందని, రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పశుసంపద అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో అందించిన సేవలు:- 90 పశువులకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స అందించడం జరిగింది.
- 62 దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ రామచంద్ర రెడ్డి, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ సందీప్, పారా వెటర్నరీ సిబ్బంది రాహుల్, రామకోటి, గ్రామ సర్పంచ్ మరియు 112 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.