ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు!
మేడ్చల్ మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్న తోటి మనిషిని ఆదుకునే మానవత్వం ఎక్కడ? అన్న ప్రశ్నకు నూతనకల్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటన అద్దం పడుతోంది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనకల్‌కు చెందిన వడ్ల శేఖర్ అనారోగ్యంతో బాధపడుతూ, ఆదుకునే వారు లేక తీవ్ర దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నాడు. గత నాలుగు రోజులుగా సరైన ఆహారం లేకుండా, చలిలో రోడ్డుపైనే దీనస్థితిలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో కనీసం తన అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్న అతడిని పట్టించుకునే వారు లేకపోవడం స్థానికులను కలచివేస్తోంది. ఒకవైపు మానవత్వం, సేవాభావం గురించి గొప్పగా మాట్లాడుతున్న సమాజంలో మరోవైపు ఆపదలో ఉన్న అభాగ్యుడికి అండగా నిలిచేవారు కరువవడం ఆవేదన కలిగిస్తోంది. కనీసం తిండి, నీడ లేక ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి సహాయం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపేట మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తక్షణమే స్పందించి వడ్ల శేఖర్‌కు వైద్య సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఆహారం, ఆశ్రయం కల్పించడంతో పాటు అవసరమైతే ప్రభుత్వ ఆశ్రయ కేంద్రానికి తరలించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఆపదలో ఉన్న వ్యక్తికి అందించే చిన్న సహాయం కూడా ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. సమాజంలోని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించి వడ్ల శేఖర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉంది.