దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి**
భీమవరం, మేజర్ న్యూస్: ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు సత్యనారాయణమూర్తి, ఉమారాణి జనసేన పార్టీలో చేరారు. భీమవరం పట్టణంలోని జనసేన జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తన తల్లి ఉమారాణి ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని తమ కుటుంబం ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యావంతురాలైన మహిళ గ్రామానికి సర్పంచ్‌గా ఉంటే అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నది తన తల్లిదండ్రుల ఆకాంక్ష అని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో దొడ్డిపట్ల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని అనంత శ్రీరామ్ తెలిపారు.