నలంద కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
సూర్య, ఆదిలాబాద్: నలంద డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల నడుమ విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అనూష సతీష్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే తెలంగాణ అని అన్నారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంప్రదాయ పండుగలను యువత, విద్యార్థినులు ఉత్సాహంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. భావితరాలకు తెలంగాణ సంస్కృతిని అందించడంలో బతుకమ్మ పండుగ కీలకమని తెలిపారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బతుకమ్మ సంబరాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ముందస్తు అజెండాలో ఈ వేడుకలకు ప్రాధాన్యం కల్పించి ప్రజలు, మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొనేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, అధ్యాపకులు నర్సింగ్, రవళి, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.