మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు!
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):కూకట్‌పల్లి పరిధిలోని మూసాపేట లేఅవుట్ ఈ-వేలం నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఎలాంటి మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయలేదని హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 27, 2026న ఈ-వేలం యథావిధిగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. వేలం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పింది.
మూసాపేట లేఅవుట్‌లోని సర్వే నంబర్లు 121/P నుంచి 141 వరకు, 146, 147, 155 నుంచి 157 వరకు ఉన్న మొత్తం 3 ఎకరాల 15 గుంటల భూమికి సంబంధించి హెచ్‌ఎండీఏ ఈ-వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఈ వేలాన్ని సవాలు చేస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ట్రక్ అసోసియేషన్‌తో పాటు పలువురు వ్యక్తులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు దాఖలైన W.P. నం. 39957/2026, W.P. నం. 39813/2026, PIL నం. 37/2026, PIL నం. 38/2026 కేసుల్లో హైకోర్టు ఈ-వేలాన్ని నిలిపివేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని హెచ్‌ఎండీఏ తన ప్రకటనలో పేర్కొంది.
షెడ్యూల్‌లో మార్పు లేదు
హైకోర్టు నుంచి వేలం నిలిపివేతకు సంబంధించి ఎలాంటి స్టే ఉత్తర్వులు లేనందున నవంబర్ 27న నిర్ణీత సమయంలో ఈ-వేలం నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వేలంలో పాల్గొనదలచిన ఆసక్తిగల వ్యక్తులు, సంస్థలు, సంబంధిత వర్గాలు గమనించి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పాల్గొనాలని హెచ్‌ఎండీఏ కోరింది.