పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు
సోమాజిగూడ /మేజర్ న్యూస్ : పంజాగుట్టలోని జివికె వన్ (GVK One) షాపింగ్ మాల్ వద్ద బాంబు బెదిరింపు కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి సాయంత్రం సమయం లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్ బృందాలకు సమాచారం అందించి, జివికె వన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
సుమారు పది మందికి పైగా బాంబు స్క్వాడ్ సిబ్బంది రంగంలోకి దిగి, డాగ్ స్క్వాడ్ సహాయంతో షాపింగ్ మాల్ పరిసరాలు, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందస్తు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన ఆగంతుక వ్యక్తి ని గుర్తించి పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.