నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పీఎం రాహత్ పథకం సేవలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పీఎం రహత్ పథకం ద్వారా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పోలీసు , వైద్య అధికారులకు సూచించారు. పీఎం రహత్ పథకం కింద బాధితులకు అందుతున్న వైద్య చికిత్స, ఆసుపత్రి స్థాయిలో చేపడుతున్న నమోదు ప్రక్రియ, సంబంధిత వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం జిల్లా కేంద్రంలో జనరల్ ఆసుపత్రిని సందర్శించి రోడ్డు ప్రమాదాల బాధ్యతలకు అందుతున్న చికిత్స విధానం, పథకం అమలు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదాల కారణంగా గాయపడి చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన జబ్బర్ ఖాన్, కొల్లాపూర్ కల్వకోలు గ్రామానికి చెందిన సత్యంలను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పరామర్శించారు. వారి వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ఆసుపత్రిలో చేరిన వివరాలు, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స గురించి బాధితులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులు, సంబంధిత సిబ్బందితో కలెక్టర్ చర్చించారు. పీఎం రాహత్ పథకం కింద బాధితులకు అందుతున్న వైద్య సేవలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. పథకం అమలులో భాగంగా బాధితుల వివరాలను పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా లేదా అనే అంశంపై ఆరా తీశారు.రోడ్డు ప్రమాద బాధితులు ఆసుపత్రికి వచ్చిన వెంటనే అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు, పథకానికి సంబంధించిన నమోదు ప్రక్రియను కూడా ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాల్సిన అవసరాన్ని కలెక్టర్ పరిశీలన సందర్భంగా ప్రస్తావించారు.బాధితులకు అందించే వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన బాధితులకు సక్రమంగా అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆసుపత్రిలో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని బాధితులకు 1.5 లక్షల రూపాయల వరకు చికిత్సకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వమే అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. అంతకుమించి ఖర్చులు అయినా కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ పథకం ద్వారా 24 గంటల లోపల సంబంధిత ఆసుపత్రిలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుప్రియ, ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ అజీమ్, ఎన్ఐసి డిఆర్ఎం మధు, ఇతర వైద్యులు, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్