మొరుసు తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి .. జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్
మొరుసు తుఫాను నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు.అత్యవసర సహాయం కోసం డయల్ 112 కు కాల్ చేయాలని, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం "మొరుసు" తుఫానుగా రూపాంతరం చెందిందని, దీని ప్రభావం నాగర్ కర్నూల్ జిల్లాపై సోమవారం రోజు ఉదయం నుండి మంగళవారం వరకు కొనసాగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. తుఫాను ప్రభావంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు కొత్తగా వరి కోతలు ప్రారంభించ వద్దని, ఇప్పటికే కోసిన ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లతో పూర్తిగా కప్పి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.ధాన్యాన్ని మార్కెట్లకు తరలించే సమయంలో వర్షం, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బలమైన గాలులు, వర్షాలు ఉన్న సమయంలో వ్యవసాయ పనులకు వెళ్లకూడదని తెలిపారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో ఉండకూడదని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాత భవనాలు, ప్రమాదకర నిర్మాణాలకు దూరంగా ఉండాలన్నారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారులు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని,వర్షాలు, తుఫాను వల్ల ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే పోలీసుల సహాయం కోసం డయల్ 112 ను సంప్రదించాలని ఎస్పీ తెలిపారు.
-పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్