విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి
మంత్రాలయం, సూర్య ప్రతినిధి, మంత్రాలయం పట్టణంలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాడ్జి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఎస్సై మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రాలయంలోని శ్రీ గురు గోవర్ధన లాడ్జిపై మరో అంతస్తు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు కింద నుంచి పైకి ఇనుప కడ్డీలు లాగుతుండగా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆస్పరి మండలం మాలగవల్లి గ్రామానికి చెందిన చిన్న ఈరప్ప (70) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆస్పరి గ్రామానికి చెందిన మహానంది (40) తీవ్రంగా గాయపడగా, కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మరో కార్మికుడు బోయ ఉరుకుందుకు గాయాలు కావడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు మహానందికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా, లాడ్జి యాజమాన్యం, నిర్మాణ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
నాగరాజు సూర్య ప్రతినిధి మంత్రాలయం, కర్నూలు జిల్లా