నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రమాదం.*
చింతపల్లి మేజర్ న్యూస్.. నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాకు చెందిన కేతావత్. చంద్రు మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రశాంతపురి తండాలో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో చంద్రు పొలం పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చంద్రు ఆచూకీ కోసం వెతుకుతుండగా, నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడి ఉండటాన్ని గుర్తించారు.
వెంటనే కుటుంబ సభ్యులు చంద్రును మాల్ పట్టణంలోని లైఫ్ స్టార్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది.మృతుడి కుమారుడు కేతావత్ .అనిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చింతపల్లి ఎస్సై ముత్యాల. రామ్మూర్తి తెలిపారు.