మంచిర్యాల అభివృద్ధికి రూ.925 కోట్లు
• సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలాభిషేకం
• ఐబీ చౌరస్తా నుంచి ఎం కన్వెన్షన్ హాల్ వరకు భారీ పాదయాత్ర
సూర్య, మంచిర్యాల టౌన్ :
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.925 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో మంచిర్యాల పట్టణ రూపురేఖలు మారనున్నాయని, మౌలిక వసతుల కల్పన మరింత వేగవంతం కానుందని స్పష్టం చేశారు.
పాలాభిషేకం అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆధ్వర్యంలో వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి ఐబీ చౌరస్తా నుంచి ఎం కన్వెన్షన్ హాల్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలతతో పాటు కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.