telangana
సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటం
సూర్య నస్పూర్ : సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ ఓసీలో కస్తూరి చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన యూనియన్ బ్రాంచ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లుగా సొంతింటి కోసం పోరాటం చేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ద్వారా ప్రకటన చేయించామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం పథకం అమలులో జాప్యం చేస్తే వినూత్న ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించాలని, సంస్థకు రావాల్సిన వేల కోట్ల బకాయిల వసూలుపై యాజమాన్యం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. 12వ వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటుపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలని కోరారు. మెడికల్ బోర్డు, ఉద్యోగాల భర్తీలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించి సమావేశాలు నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, పిట్ సెక్రటరీ సీపతి బానేష్, రాష్ట్ర నాయకులు నరహరి రావు, బ్రాంచ్ నాయకులు మేల్లం శ్రీధర్, అఖిల్, బొజ్జ నవీన్, జగన్మోహన్‌రెడ్డి, చిగురు లక్ష్మణ్, కార్మికులు పాల్గొన్నారు.