telangana
జానపద నృత్యంలో డాక్టరేట్ సాధించిన సెక్యూరిటీ గార్డ్‌కు ఘన సన్మానం
సూర్య, మందమర్రి : సింగరేణి సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూనే జానపద కళారంగంలో విశేష ప్రతిభ కనబరిచి డాక్టరేట్ సాధించిన మందమర్రి ఏరియాకు చెందిన సీనియర్ సెక్యూరిటీ గార్డ్ కే.ఆర్. సంపత్‌కు ఘన సన్మానం లభించింది. ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో సోమవారం ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఆయనను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. విధి నిర్వహణతో పాటు కళారంగంపై ఆసక్తిని పెంపొందించుకుని జానపద నృత్యంలో విశేష విజయాలు సాధించడం అభినందనీయమన్నారు. సింగరేణిలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనలోని కళా ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జానపద నృత్యంలో సంపత్ సాధించిన ప్రతిభకు గుర్తింపుగా జర్మనీకి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఫైన్ ఆర్ట్స్ (ఫోక్ డ్యాన్స్) విభాగంలో డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు. అలాగే, 2025లో నిర్వహించిన కోల్ ఇండియా సాంస్కృతిక పోటీల్లో జానపద నృత్య విభాగంలో బంగారు పతకం సాధించడం ఆయన ప్రతిభకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులోనూ సంపత్ మరిన్ని విజయాలు సాధించి సింగరేణి సంస్థకు, మందమర్రి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ మద్దెల శంకర్, జూనియర్ ఇన్‌స్పెక్టర్లు ఓదెలు, సంజయ్ కుమార్ దాస్, ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ సభ్యుడు జగన్నాథ చారి, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ పారుపెల్లి సంజీవ్‌తో పాటు కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.