మిస్సింగ్ భూమి రికార్డుల్లో ప్రత్యక్షం.. మారిన యాజమాన్య హక్కు
- అయ్యవారిపల్లిలో రూ.4 కోట్ల భూమి వ్యవహారంపై అనుమానాలు !
- 115 సర్వే నంబర్‌లో 13.17 ఎకరాల భూమి బదిలీపై విచారణ
- పార్ట్-బీలో ఉన్న భూమి 11 మంది పేర్లపైకి ఎలా మారింది ?
- ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించిన ప్లాట్ల కొనుగోలుదారుల్లో ఆందోళన
పది రోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇస్తాం: సబ్ కలెక్టర్ సలోని చాబ్రా
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలోని 115 సర్వే నంబర్‌లో ఉన్న 13 ఎకరాల 17 గుంటల భూమి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సుమారు రూ.4 కోట్ల విలువైన ఈ భూమి యాజమాన్య హక్కులు పలువురి పేర్లపైకి మారడం, అనంతరం మరో ఇద్దరి పేర్లపై రిజిస్ట్రేషన్ కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి పది రోజుల్లో కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా వెల్లడించారు.
2008లో కొనుగోలు.. లేఅవుట్‌తో ప్లాట్ల విక్రయం
బాధితుడు వర్కల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ ఖజామియా, మహమ్మద్ చాంద్ పాషాల నుంచి 2008లో సంబంధిత భూమిని కొనుగోలు చేసి, గ్రామపంచాయతీ అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. అయితే ధరణి రికార్డుల సమయంలో 115 సర్వే నంబర్‌లోని 13 ఎకరాల 17 గుంటల భూమి మిస్సింగ్‌గా నమోదైందని, దీనిపై తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఈ భూమిని పార్ట్-బీలో చేర్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
11 మంది పేర్లపైకి భూమి బదిలీ ఎలా?
బాధితుడి ఆరోపణల ప్రకారం.. 2026 ఆగస్టు 19న బూర మల్లయ్య, అరెకంటి భగవంత్, బండమిది మల్లయ్య తదితర 11 మంది పేర్లపై భూమి బదిలీ కాగా, సెప్టెంబర్ 26న కే. స్వప్న, ఉల్పల వనజ పేర్లపై తిరిగి రిజిస్ట్రేషన్ జరిగినట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్ రికార్డుల్లో అందుబాటులో లేని భూమి ఇతరుల పేర్లపైకి ఎలా మారిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ బదిలీలకు సంబంధించిన పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులపై సమగ్ర విచారణ జరపాలని బాధితుడు కోరుతున్నారు.
ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, వాటిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. గతంలో నయీం పేరుతో భూముల వివాదాలు జరిగిన నేపథ్యంలో, ప్రస్తుత వ్యవహారంలోనూ ఆ పేరు ప్రస్తావన రావడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించిన ప్లాట్ల కొనుగోలుదారుల ఆందోళన
సంబంధిత సర్వే నంబర్‌లో సుమారు 50 ప్లాట్లు విక్రయించగా, వాటిలో 37 మంది లబ్ధిదారులు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినట్లు ప్లాట్ల కొనుగోలుదారులు చెబుతున్నారు. భూమి హక్కులపై నెలకొన్న వివాదంతో తమ పరిస్థితి ఏమవుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయి విచారణ చేపడతాం: సబ్ కలెక్టర్
ఈ భూమి వ్యవహారం తన దృష్టికి వచ్చిందని అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి, ఎవరి ఆధారంగా బదిలీలు జరిగాయి అనే అంశాలను పరిశీలించి, పది రోజుల్లో కలెక్టర్‌కు పూర్తి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.
భూమి బదిలీ వెనుక వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి, బాధ్యులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.