మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సూర్య - మానకొండూర్ : క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, వ్యాధి లక్షణాలను మొదటి లేదా రెండో దశలోనే గుర్తించగలిగితే 80 నుండి 90 శాతం వరకు పూర్తిగా నయం చేయవచ్చని కరీంనగర్ మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హారిక స్పష్టం చేశారు.మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ బోట్ల స్వరూప కిషన్, ఉప సర్పంచ్ దాడి సతీష్, గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో మెడ్‌వేవ్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు జనరల్ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పులిగోల్ల హారిక మాట్లాడుతూ.. దేశంలో ఏటా సుమారు 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా, వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల 9 నుండి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పెరగడంతో పాటు కలుషిత ఆహారం, వాయు కాలుష్యం, ముఖ్యంగా పొగాకు, సిగరెట్, బీడీ, మద్యం వంటి అలవాట్ల వల్ల నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరుగుతున్నాయని తెలిపారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి: నోటిలో లేదా నాలుకపై నెల రోజులు దాటినా మానని పుండ్లు, ఆహారం మింగడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక దగ్గు, ఆయాసం, రొమ్ములో గడ్డలు, మహిళల్లో నెలసరి కాకుండా అదనపు రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరానికి వచ్చిన వారికి తదుపరి అడ్వాన్స్‌డ్ పరీక్షలు అవసరమైతే తమ ఆసుపత్రిలో ప్రత్యేక రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
250 మందికి వైద్య సేవలు:
ఈ వైద్య శిబిరంలో డాక్టర్ హారిక, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అఖిల్, డాక్టర్ చందన, డాక్టర్ రాకేష్‌ల బృందం సుమారు 250 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అవసరమైన వారికి ఉచితంగా బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు సీఏ-125, పీఎస్ఏ, పాప్ స్మియర్, బ్రెస్ట్ అనాలసిస్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆడ్మిన్ అన్నలదాసు మహేందర్,ఆసుపత్రి సిబ్బంది శ్రీధర్, వంశీ, రమేష్ చారి, తదితరులు పాల్గొన్నారు.