గుంతల ‘మయం’.. ప్రయాణం ‘భయం’
సూర్య తాడ్వాయి: కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిప్రతి రోజు వందలాది వాహనాలు ఈ రోడ్డుపై వెళ్తున్నందున పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.రహదారి అంటే ప్రయాణాన్ని సుఖమయం చేయాలి. గుంతల మయమై వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు.ఈ రోడ్డుపై పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ రోడ్డు భవనాల శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మాత్రం ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తోంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డు ఇప్పుడు మృత్యుకూపంగా మారింది. అడుగుకో గుంత.. గజానికో గోతితో వాహనదారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.
మృత్యువుకు రహదారులుఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నీరు చేరడంతో లోతు తెలియక వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో లైటింగ్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ఈ గుంతల వల్ల కిందపడి తీవ్ర గాయాలపాలవగా, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నా యి అధికారులు వెంటనే స్పందించి ప్యాచ్ వర్క్ చేపట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.