కార్యకర్తలకు అండగా ఉంటా.. ఆ ధైర్య పడవద్దు. తలారి రంగయ్య.
*శెట్టూరు:** కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య భరోసా ఇచ్చారు. శెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామంలో దాడికి గురైన వైసీపీ నాయకుడు గొల్ల మల్లికార్జున కుటుంబాన్ని ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చి, జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చింతర్లపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై డాక్టర్ తలారి రంగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విభేదాలు సహజమని, అయితే వాటిని వ్యక్తిగత దాడులకు వేదికగా మార్చుకోవడం సమంజసం కాదని అన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీటీసీ చెన్నకేశవులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని తలారి రంగయ్య హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఇలాంటి ఘటనలకు భయపడి వెనుకడుగు వేయవద్దని సూచించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధితులకు న్యాయం చేయాలని కోరారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని, గ్రామాల్లో రాజకీయ కక్షలు, దాడులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తలారి రంగయ్య స్పష్టం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటుందని పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.