జిల్లాస్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ పోటీలను ప్రారంభించిన నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ
సూర్య, నంద్యాల బ్యూరో:నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్.ఆర్.జి. చెస్ అకాడమీ నిర్వహణలో ఆదివారం నంద్యాల దేవ నగర్ లో ఉన్న రాహుల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు,పాఠశాల కరస్పాండెంట్ సుబ్బయ్య సహకారంతో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి నాలుగవ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి,
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి చదువుతోపాటు కళలు,క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు. క్రీడలలో క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన విజయాలకు దోహదం చేస్తుందని అన్నారు. రాహుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ సుబ్బయ్య మాట్లాడుతూ చదరంగం మేధో శక్తిని పదును పెడుతుందని,ఏకాగ్రత ఇనుమడింప చేస్తుందని అన్నారు. తద్వారా విద్య లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు 12 వివిధ వయసు విభాగాల్లో వేరు వేరుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ పోటీల లో ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కొక్క క్యాటగిరి లో 10 ప్రైజ్ ల చొప్పున మొత్తం 120 ప్రైజ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు. మొత్తం ఐదు జిల్లా స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్లు నిర్వహించి ప్రతిభను గుర్తించి రాష్ట్రస్థాయిలో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో విశ్రాంత అధ్యాపకులు వెంకటయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు పుల్లయ్య,జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, రాహుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సునీత , చీఫ్ ఆర్బిటర్ లు సుజాత,రమ్య, సీనియర్ చదరంగం క్రీడాకారిణి,బహుమతుల స్పాన్సర్ మాధవి,నిర్వాహకులు మాలిక్ భాషా, శ్రీనివాసులు, కోచ్ రాజేంద్ర చెస్ క్రీడాకారులు,క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా