కొత్త ఏఐసీసీ కార్యదర్శుల నియామకం.. తెలంగాణకు సచిన్ సావంత్, సైమన్ అలెక్స్
న్యూఢిల్లీ: సంస్థాగత బలోపేతంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ (AICC) కార్యదర్శులను నియమించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం (నవంబర్ 19) రాత్రి ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శులుగా సచిన్ సావంత్, సైమన్ అలెక్స్‌లను అధిష్టానం నియమించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు అండమాన్ నికోబార్ దీవులకు ఉమ్మడి కార్యదర్శులుగా సెంథమిల్ అరసు, వి.శంకర్‌లకు బాధ్యతలు అప్పగించారు.
ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణకు చెందిన పలువురు నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కాయి. ఒడిశా ఏఐసీసీ కార్యదర్శిగా జెట్టి కుసుమకుమార్, కర్ణాటక ఏఐసీసీ కార్యదర్శిగా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ నియమితులయ్యారు. వీరితో పాటు ట్రైనింగ్ మరియు సందేశ విభాగం (Training and Messaging Department) బాధ్యతలను సంతోష్ కోరుకొండకు అప్పగించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రకటనలో పేర్కొంది.