కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
సూర్య- బిక్కనూర్ : కూరగాయల సాగుతూ రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. ఆదివారం మండలంలోని గురజకుంట గ్రామంలో 58 మంది రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న రాయితీలను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో పంట మార్పిడి చేపట్టి కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ప్రత్యేక రాయితీలు అందిస్తోందన్నారు.కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600, మల్చింగ్ విధానం కోసం ఎకరాకు రూ.8,000 చొప్పున మొత్తం రూ.17,600 వరకు రాయితీ అందించనున్నట్లు తెలిపారు.గ్రామానికి చెందిన 58 మంది రైతులకు ఈ పథకం కింద సుమారు రూ.4 లక్షల మేర ప్రభుత్వం నుంచి రాయితీలు మంజూరయ్యాయి. రాయితీలతో లబ్ధి పొందిన రైతులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగులో కొత్త పద్ధతులను అనుసరించి మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,గురజకుంట గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.