telangana
కొమురం భీమ్ వర్ధంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలి - ఆదివాసీ సంఘాల నేతల డిమాండ్
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : ఆదివాసీ హక్కుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్ వర్ధంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆయన వర్ధంతిని ఒక జిల్లాకే పరిమితం చేయడం ఇతర జిల్లాల ఆదివాసీలను విస్మరించడమేనని విమర్శించారు.నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఆదివాసీ నాయక పోడు సంఘం జిల్లా అధ్యక్షుడు సాకి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ 86వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ కొమురం భీమ్ త్యాగాలు యావత్ ఆదివాసీ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని, వర్ధంతిని అన్ని జిల్లాల్లో అధికారికంగా నిర్వహించి భావితరాలకు ఆయన చరిత్రను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ముసలి చిన్నయ్య, సుంచు సవీన్, రామేష్, జంగిలి రాకేష్, మంద మల్లేష్, బోసని రాజేశ్వర్, తోడుసం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.