కొడంగల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. పది గ్రామాలకు విద్యుత్ అంతరాయం
కొడంగల్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని తాండూర్ రోడ్డులో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఈ ఘటనతో కొడంగల్ పట్టణంతో పాటు పరిసర పది గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి అందుతున్న వివరాల ప్రకారం.. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఆయిల్ లీకేజీ అవుతున్న విషయాన్ని సిబ్బంది గుర్తించినప్పటికీ, అధికారులు సకాలంలో స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.